Revanth Reddy Bihar DNA: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ.. ‘బిహార్ డీఎన్ఏ (Bihar DNA)’ అంటూ సంభోదించడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA bloc)లోని పార్టీలు స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం అన్నారంటే..
Revanth Reddy Bihar DNA: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ది బిహార్ డీఎన్ఏ అని తన తెలంగాణ డీఎన్ఏ అని రేవంత్ అన్నారు. అందుకే తెలంగాణకు కేసీఆర్ కంటే తానే బెటర్ అని రేవంత్ పేర్కొన్నారు.
“నా డీఎన్‌ఏ తెలంగాణ.. కేసీఆర్ డీఎన్‌ఏ బిహార్. ఆయన బిహార్‌కు చెందిన వ్యక్తి. కేసీఆర్ కులం కుర్మీ. కేసీఆర్ కుటుంబం బిహార్ నుంచి విజయనగరం, అక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చారు. బిహార్ డీఎన్‌ఏ కంటే తెలంగాణ డీఎన్‌ఏ బెటర్” – మీడియా ఇంటరాక్షన్‌లో రేవంత్ రెడ్డి
Revanth Reddy Bihar DNA: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బిహార్ డీఎన్‌ఏ’ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష ‘భారత’ కూటమి సభ్యులు దీనిని ఖండించాలని, కొత్తగా నియమితులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటని, దురహంకారంగా ఉన్నాయని అభివర్ణించారు. బిహార్ ప్రజలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. రేవంత్ రెడ్డి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇండియా కూటమి సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కనీసం బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇప్పటివరకు రేవంత్ వ్యాఖ్యలపై ఎందుకు ఏమీ మాట్లాడలేదన్నారు. బిహార్‌లోని కాంగ్రెస్ సభ్యులు ఏమి చేస్తున్నారన్నారు.
Revanth Reddy Bihar DNA: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేతలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని కూడా ప్రసాద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక ప్రాంతంలోని డీఎన్‌ఏ బలహీనంగా ఉందని, వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బిహార్ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని బీజేపీ ఎంపి, కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మరో బీజేపీ ఎంపీ, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.